telugudept1919@gmail.com +91 40-27682294

 

History of the Department

History of the Departmentఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ

ఉస్మానియా విశ్వవిద్యాలయం క్రీ.శ.1918లో స్థాపించబడింది. ఉర్దూబోధనా భాషగా వెలసిన ఈ విశ్వవిద్యాలయం దేశీయ భాషలలో విద్యా బోధన నిర్వహించే విద్యాసంస్థగా భారతదేశంలో కీర్తిని పొందింది. ఆ తరువాత 1948లో ఆంగ్లభాషను బోధనా భాషగా స్వీకరించి, దేశంలోని విశ్వవిద్యాలయాలతో పాటు ఉన్నత విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ 1919లో పనిచేయటం ప్రారంభించింది. అప్పటినుండి శాఖాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు నిర్వహించిన ఆచార్యుల పర్యవేక్షణలో అధ్యాపకుల, అధికారుల అండదండలతో తెలుగు శాఖ మూడు పూవులారుకాయలుగా అభివృద్ధిచెందుతూ వచ్చింది.

ఆచార్య రాయప్రోలు సుబ్బారావుగారు ప్రముఖ కవి, పండితులు, భావ కవిత్వ యుగానికి వైతాళికులు. తెలుగుశాఖకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాయప్రోలు వారే నారుపోసి, నీరుపోసి పెంచినవారు. తొలిరోజుల్లో తెలుగు ఐచ్ఛిక భాషగా పట్టభద్ర స్థాయిలో బోధింపబడుతూ ఉండేది. ఇది తెలంగాణం తెలుగుగడ్డ అయినా తెలుగుభాషా సాహిత్యాలను చదవటం అప్పటిరోజుల్లో సాహసంతో కూడిన కార్యంగానే ఉండేది. అందువల్ల అల్పసంఖ్యలో ఉన్న విద్యార్థులు ఇంటర్‌మీడియట్‌, బి.ఏ.తరగతుల్లో విశ్వవిద్యాలయ కళాశాలలోను, అనుబంధ కళాశాలల్లోనూ ఐచ్ఛిక భాషగా తెలుగును అధ్యయనం చేస్తుండేవారు. క్రమంగా తెలుగు పట్టభద్రులు పెరిగేకొద్దీ ఉస్మానియాలో స్నాతకోత్తర విద్యాకోర్సు ప్రారంభమైంది. ఎం.ఏ.తరగతులు 1939 -40 సంవత్సరంలో ప్రారంభమైనాయి. 1942లో మొదటిసారి పరీక్షలు నిర్వహింపబడ్డాయి. 1942లో ఎం.ఏ. పరీక్షలో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులైన ప్రప్రథమ విద్యార్థి పల్లా దుర్గయ్యగారు. వారు ఉద్యోగ విరమణ చేసేంతవరకూ ఈ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేశారు.

రాయప్రోలువారి కాలంలో ఎం.ఏ.తెలుగు తరగతుల్లో ప్రతి సంవత్సరమూ విద్యార్థులు ఉండేవారు కారన్న విషయం గమనార్హం. ఆ స్థితి పోలీసుచర్య జరిగేంతవరకూ కొనసాగింది. ఎం.ఏ.లో చేరిన విద్యార్థుల సంఖ్య కూడా అత్యంత స్వల్పంగా ఉండేది. ఉదాహరణకు 1946లో ఒకరు, 1943లో నలుగురు, 1947లో ఒకరూ ఎం.ఏ.పరీక్షకు తెలుగు చదివారు. ఈ పరిస్థితికి కారణం నాటి రాజకీయ సాంఘిక వాతావరణమే కారణం.

రాయప్రోలు సుబ్బారావుగారు 1919 నుండి తెలుగుశాఖకు అధ్యక్షులుగా ఉన్నా 1941లో ఆచార్య పదవి నలంకరించారు. 1946లో అధ్యక్షులుగా ఉద్యోగ విరమణచేసారు.

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు 1946లో తెలుగుశాఖకు అధ్యక్షులైనారు. వీరు దేశ భాషాభిమానాలతో పాటు దృఢ సంకల్పం, దూరదృష్టి, కార్యదీక్ష గల మనీషులు. 1948 సెప్టెంబరులో పోలీసుచర్య జరిగి, హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమైన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయ చరిత్రలో ఒక నూతనాధ్యాయం ప్రారంభమైనదని చెప్పవచ్చు.

1950 ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు దేశీయ భాషలనుఅవశ్య పఠనీయాంశాలుగా విద్యా విధ్యానంలో చేర్చే సమస్యను అకడమిక్‌ కౌన్సిల్‌ ముందు ప్రతిపాదింపవలసినదిగా ఆచార్య తణికెళ్ల వీరభద్రుడుగారిని కోరడం జరిగింది. ఆయన ఆ అంశాన్ని సమర్ధనీయంగా అంగీకారయోగ్యంగా ప్రతిపాదించారు.

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు ప్రాంతీయ భాషను (Regional Language) విద్యార్థులందరూ రెండవ భాష (Second Language) గా ఆవశ్యంగా పఠించాలని ప్రతిపాదించారు. లక్ష్మీరంజనంగారి ప్రతిపాదనలకు ఆచార్య రావాడ సత్యనారాయణ, ఆచార్య యన్‌.వి.సుబ్బారావుగార్లు వంటి శాస్త్రాచార్యుల సహాయ సహకారాలు కూడా లభించాయి. తీవ్రమైన ప్రయత్నం ఫలితంగా ఈ పాఠ్య ప్రణాళికను విశ్వవిద్యాలయంవారు అంగీకరించారు.

మాతృభాషా సాహిత్యాధ్యయనావకాశం లభించిన తెలుగు విద్యార్థులు ఎంతో సంతోషించారు. విశ్వవిద్యాలయానికి అనుబంధింపబడిన అన్ని కళాశాలల్లో తెలుగు భాష అవశ్య పఠనీయాంశంగా అవతరించింది. రెండవ భాషగా తెలుగుకు వారానికి నాలుగు పీరియడ్లు, ఐచ్చిక భాషగా ఉన్న తెలుగుకు వారానికి ఆరు పీరియడ్లు కేటాయింపబడినాయి. దానితో కళాశాలల్లో అధ్యాపకుల అవసరం పెరిగింది. తెలుగు భాషా సాహిత్యాల చరిత్ర, సంస్కృతుల విశేషాల అధ్యయనం విద్యార్థుల్లో చైతన్య వికాసాలను కల్పించింది. ఆచార్య దివాకర్ల వేంకటావధాని, శ్రీమతి నాయని కృష్ణకుమారి లాంటి విద్వన్మణులు తెలుగు శాఖలో చేరటం ఈ సమయంలో జరిగింది. విశ్వవిద్యాలయ కళాశాలలోని తెలుగు విద్యార్థులందరూ కలిసి ప్రతి యేటా ఆంధ్రాభ్యుదయోత్సవాలను వారం రోజులపాటు నిర్వహిస్తూ దేశం నలుమూలల నుంచీ విద్వాంసులను, కవులనూ పిలిపించి ఉపన్యాస కావ్యగానాలను ఏర్పాటు చేయటమే కాకుండా, బహుముఖంగా సాంస్కృతిక కార్యమ్రాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించటం జరిగింది. తెలుగుభాషా సంస్కృతుల వికాసానికి విద్యార్థుల ఉత్సాహం కూడా వెన్నెముకగా ఉన్నదనటానికి ఆ ఉత్సవాలు చక్కని నిదర్శనాలు. దానికి దర్శకత్వం ఎక్కువ సంవత్సరాలు తెలుగుశాఖాధ్యక్షులైన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారే నిర్వహించారు. అప్పటి విద్యార్థులుగా ఉండి, ఆ తర్వాత తెలుగుశాఖలో అధ్యాపకులుగా పనిచేసిన ఆచార్య బి.రామరాజుగారు, ఆచార్య సి.నారాయణరెడ్డిగారు, శ్రీమతి ఇ.వసుమతీరెడ్డిగారు,డా. జి.వి.సుబ్రహ్మ ణ్యంగారు కార్యవర్గ సభ్యులుగా ఆ ఉత్సవ నిర్వహణల్లో, ఆయా సంవత్సరాల్లో కృషి చేశారు.

పట్టభద్రస్థాయిలోనే కాక, ఎం.ఏ.తరగతుల స్థాయిలో కూడా ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు చేసిన నూతన ప్రయోగాలు ప్రశంసనీయమైనవి. ఎం.ఏ. విద్యార్థులు తాము చదివే అంశాల మీద వ్యాసాలను వ్రాసి '' సెమినార్లలో ఆచార్యుల ముందు చదవాలనీ, ఆ చర్చలలో అధ్యాపకులే కాక విద్యార్థులు కూడా పాల్గొనాలనీ వారు ప్రణాళికను సిద్ధం చేశారు'' ఈ సెమినార్‌ పద్ధతి 1953లో ప్రారంభమైనది. ఆంధ్రుల చరిత్రి సంస్కృతులు, మహాభారతము, పోతన శ్రీనాథులు, అష్టదిగ్గజ కవులు, దక్షిణాంధ్ర యుగం, నాటకాలు ఇట్లా అనేక అంశాల పైన సదస్సులు జరిగాయి. అలా చదువబడిన వ్యాసాలను విద్యార్థుల కృషితో తరువాత ప్రచురించటం కూడా జరిగింది. ఆంధ్ర సంస్కృతి, శ్రీనాథ భారతం, అష్టదిగ్గజాలు మొదలైన గ్రంథాలు ఇట్లా వెలుగు చూసినవే.

తెలుగులో ఎం.ఏ. పట్టభద్రుల సంఖ్య క్రమంగా పెరగసాగింది. అధ్యాపకుల సంఖ్య అభివృద్ధి అవుతూ వచ్చింది. పరిశోధనావకాశాలను కల్పించవలసిన పరిస్థితులు పరిపక్వమైనాయి. తెలుగు శాఖవారు తెలుగులో పిహెచ్‌.డి.పట్టానిచ్చే పరిశోధన ప్రణాళికను రూపొందించి విశ్వవిద్యాలయానికి సమర్పించారు. డా.సూరి భగవంతంగారు ఉపాధ్యక్షులుగా ఉన్న కాలంలో 1952-53 సంవత్సరంలో, తెలుగుశాఖలో పరిశోధనకవకాశం లభించింది. మొట్టమొదటిసారి తెలుగులో ఇక్కడ పిహెచ్‌.డి. పట్టాన్ని పుచ్చుకొన్న పరిశోధకులు డా.బి.రామరాజుగారు.పండితులచే ఎంత కాలం నుంచో అనాదరింపబతూ, ప్రజలనోళ్లల్లో గూళ్లుకట్టుకొని జీవితాన్ని కొనసాగిస్తున్న జానపద సాహిత్యంమీద వారు పరిశోధన చేశారు. విషయాన్ని ఎన్నికచేయటంలో దాన్ని సమగ్రంగా నిర్వహింపజేయటంలో ఆచార్య లక్ష్మీరంజనంగారు చూపే విశాలదృష్టికి విద్వత్పుష్టికీ తెలుగుశాఖలో వెలసిన ఈ మొదటి సిద్ధాంత గ్రంథమే పరమ తార్కాణం! లక్ష్మీరంజనంగారు అధ్యక్షపదవి నుండి విరమించే నాటికి అంటే 1953-64 సంవత్సరాల నడుమ పదకొండేళ్ళలో పదకొండు సిద్ధాంత వ్యాసాలకు పిహెచ్‌.డి.డిగ్రీలు ప్రదానం చేయబడ్డాయి. ఆ ఘనత ఆయనకే దక్కింది. లక్ష్మీరంజనంగారి కాలంలో పరిశోధన పర్యవేక్షకులుగా వారూ, ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారూ, ఆచార్య బి.రామరాజుగారు, డా.పల్లా దుర్గయ్యగారు ఉంటూ విద్యార్థులకు సలహాలనిస్తూ ఉండేవారు.

తెలుగు శాఖలో ప్రారంభింపబడిన పరిశోధన ఒక ప్రణాళిక ననుసరించి సాగినట్లుగా సమీక్షకులను స్పష్టం కాగలదు. తెలుగులో సమగ్ర సాహిత్య చరిత్ర నిర్మింపడాలని తెలుగువారంతా కలలు కంటున్నారు. కాని, దాని నిర్మాణం జరగాలంటే ఎంతో అధ్యయనం, పరిశోధన జరగాలి. దాని కనుబంధంగా, భాషా చారిత్రక సాంస్కృతికాంశాల మీద కూడా పరిశోధన సాగాలి. ఆ అవసరాన్ని గుర్తించి తెలుగుశాఖలో మొదటి పరిశోధనాంశాలను ఎంపిక చేయటంలో సాహిత్య ప్రక్రియలనూ, యుగాలనూ దృష్టిలో పెట్టుకొన్నట్లు కనబడుతుంది. జానపద సాహిత్యం, ప్రాఙ్నన్నయుగం, కవిత్రయ యుగం, శ్రీనాథ యుగం, ప్రబంధ యుగం, దక్షిణాంధ్రయుగం, ఆధునికయుగం, నాటక వాఙ్మయం, శతకవాఙ్మయం, నవలా సాహిత్యం ఇలాపరిశోధనాంశాలు ఇవ్వబడినాయి. ఆతరువాత ప్రసిద్ధ కవుల కావ్యాల పరిశోధన సాగింపబడినది. ఆ తరువాత నిర్దిష్టమైన అంశాలపై పరిశోధన ప్రారంభమయింది. చారిత్రక భాషా సాంస్కృతికాధ్యయనం అనుబంధంగా సాగింది. ఈ శాఖలో జరిగిన పరిశోధన ప్రణాళికను విశ్లేషణ దృష్టితో వివేచిస్తే విమర్శకులకు ఆ ప్రణాళికలోని ఔచిత్యం అవగతమౌతుంది. ఈ బృహత్ప్రణాళికకు అంకురార్పణం చేసి రూపకల్పనం చేసిన గౌరవం ఆచార్యం ఖండవల్లి లక్ష్మీరంజనంగారిదనటంలో సంశయం లేదు.

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు సంశోధిత ఆంధ్రమహాభారత ప్రతి నిర్మాణ ప్రచురణ కార్యక్రమాన్ని రూపొందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం కోసం సమర్పించారు. ఆ ప్రణాళిక 1963లో ప్రారంభించబడింది. ఆంధ్రమహాభారత సంశోధిత ప్రతి ఎనిమిది సంపుటాల్లో ప్రచురింపబడింది. పనిప్రారంభించిన నాటి నుండి ముగిసేంతవరకూ (1973) ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారే దానిని పర్యవేక్షించారు. వారూ, ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారూ సంపాదకవర్గ సభ్యులు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారూ, వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారూ, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారూ సలహా సంఘం సభ్యులు. తెలుగుశాఖలోని అధ్యాపకులు కొందరు సహాయ సంపాదకులుగా సహకరించారు. వారు - డా.బి.రామరాజుగారు, డా.కేతవరపు వేంకటరామకోటిశాస్త్రిగారు, డా.కె.గోపాలకృష్ణరావుగారు, డా.ఎం.కులశేఖరరావుగారు, డా.అమరేశం రాజేశ్వరశర్మగారు, డా.కె.సుప్రసన్నాచార్యులుగారు,డా. యం.రంగారావుగారు, డా.నాయని కృష్ణకుమారిగారు, డా. పి.యశోదారెడ్డిగారు.

ఈ గ్రంథ నిర్మాణ ప్రణాళికకు తదనంతర వైస్‌-ఛాన్సలర్‌ డా.డి.యస్‌.రెడ్డిగారి సహాయ సహకారాలు విశేషంగా లభించాయి. ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి సంపాదించటంలోనే కాక, లండన్‌లోని ఇండియా హౌస్‌ గ్రంథాలయంలో ఉన్న ప్రతికి ఛాయాచిత్ర ప్రతిని సంపాదించటంలో కూడా వారెంతో శ్రద్ధను ప్రకటించారు. తమ ఉపాధ్యక్ష పదవీకాలంలో కలకాలం నిలిచే సాహిత్య కార్యక్రమం 'మహాభారత సంశోధిత ముద్రణ' మని వారు సగర్వంగా చెప్పుకొన్నారు. విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా (1968లో) మొదటి సంపుటాన్ని సునీల్‌కుమార్‌ ఛటర్టీగారు ఆవిష్కరించారు.

తెలుగుశాఖ తెలుగువారికర్పించిన వెలలేని కానుక ఆంధ్రమహాభారత సంశోధిత ప్రతి ప్రచురణం. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన బృహత్తర విజయం.

లక్ష్మీరంజనంగారి కాలంలో ఎం.ఏ.పాఠ్య ప్రణాళికలో ద్రావిడ భాషాధ్యయనం ఒక భాగంగా చేర్చబడింది. ఆ పద్ధతిలో ఎం.ఏ.విద్యార్థి కన్నడ, తమిళ, మళయాళ భాషల్లో ఏదైనా ఒకటి ఐచ్ఛికంగా తీసుకోవలసి వచ్చేది. దానివల్ల భాషా సాహిత్య విషయాల్లో అదాన ప్రదానాలను గురించి, పరస్పర ప్రభావాలను గురించి, విద్యార్థి భావికాలంలో పరిశోధన చేయడానికి వీలుంటుందని భావింపబడింది. శాసన పఠనం, అందులోని భాషా విశేషాలను తెలుసుకోవటం కూడా పాఠ్య ప్రణాళికలో చోటు చేసుకున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.చదివిన విద్యార్థులకు అటు సాహిత్యంతోనూ, భాషా శాస్త్రంతోనూ, అలంకార శాస్త్రంతోనూ, సంస్కృతంతోనూ, ద్రావిడ భాషలతోనూ పరిచయం కలగడంతో ఆధునిక ఆంధ్రాధ్యాపకుని కుండవలసిన సమన్వయ వ్యక్తిత్వం ఏర్పడాలని భావించి రూపొందించిన ప్రణాళిక అది.

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి కాలంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన మరో అంశం -1956లో ప్రాచ్య భాషాధ్యయనంలో డిగ్రీ తరగతులు ప్రారంభం కావటం. దీనివల్ల ప్రాచ్య భాషాధ్యయనానికి గల ప్రత్యేక ప్రతిపత్తిని విశ్వవిద్యాలయం గుర్తించిందన్న విషయం గమనించదగిన అంశం.

ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు 1964లో తెలుగు శాఖ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అప్పుడు ఓరుగల్లులో పోస్టుగ్రాడ్యుయేట్‌ సెంటర్‌ 1967లో స్థాపించబడింది. అందులో తెలుగులో ఎం.ఏ. కోర్సులు ప్రారంభించబడ్డాయి. ఆచార్యస్థానం కల్పింపబడింది. డా.బి.రామరాజుగారు ఆ స్థానానికి ఎన్నికయ్యారు. వారి నాయకత్వంలో అక్కడ తెలుగుశాఖ భావి విశ్వవిద్యాలయ రూపకల్పన కనుగుణంగా తీర్చబడింది.

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి అధ్యక్షకాలంలో ప్రారంభమైన ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణం ఆచార్య అవధానిగారి కాలంలో పూర్తి అయింది.

1971లో యూనివర్సిటీ అనుబంధ కళాశాలయైన హైదరాబాదు సాయం కళాశాలలో తెలుగు ఎం.ఏ. తరగతులు ప్రారంభింపబడ్డాయి. దీనితో మూడు కేంద్రాలలో ఎం.ఏ. తరగతులు నిర్వహింపబడడం మొదలయింది. దాదాపు 120 మంది విద్యార్థులకు ప్రవేశార్హత లభించింది. దాదాపు 15 మంది అధ్యాపకులకు స్నాతకోత్తర తరగతులకు బోధించే అవకాశం లభించింది. వీరికాలంలోనే కళాశాలలు తెలంగాణా ప్రాంతంలో విరివిగా స్థాపించబడటం, తెలుగు అధ్యాపకులకు ఉద్యోగావకాశాలు దొరకటం వల్ల తెలుగుశాఖ విస్తృతిని సాధించింది.

ఆచార్య అవధానిగారు ప్రాచ్య విద్యా ప్రణాళికలో ఎం.ఓ.ఎల్‌. డిగ్రీ పరీక్షలు ప్రారంభింపబడటానికి ఎంతో కృషి చేశారు. విశ్వవిద్యాలయం అవధాని గారి సూచనలను 1967లో అంగీకరించింది. ఆ డిగ్రీలను తీసుకున్న అభ్యర్థులు ప్రాచ్య కళాశాలాధ్యాపకులుగా నియమితులు కావటమే కాకుండా పిహెచ్‌.డి. డిగ్రీలను కూడా సంపాదించి విద్యార్హతలను పెంచుకుంటున్నారు.

తెలుగుశాఖలో పనిచేస్తున్న అధ్యాపకులలో పరిశోధన రచనా ప్రవృత్తులు పెంపొందించటానికి ఆచార్య అవధానిగారు ‘Men of Letters Series’ ఒక దానిని ప్రారంభించారు. ఆ ప్రణాళిక క్రింద అధ్యాపకులందరూ నిర్దేశింపబడిన కవిని గురించి, సర్వాంశ సమృద్ధంగా ఒక గ్రంథాన్ని 150 పుటలకు మించకుండా రాసి ఇవ్వలసి ఉంది. ఆ గ్రంథ ప్రచురణ వలన సాహితీ మూర్తులపై సదవగాహనం; సమాజంలోనూ, విద్యార్థుల్లోనూ సదవగాహన పెరగగలదని భావింపబడింది. ఈ వరసలో మూడు గ్రంథాలు యు.జి.సి.వారి సహాయంతో ప్రచురింపబడ్డాయి. అవి -

    • 1. నన్నయభట్టారకుడు - ఆచార్య దివాకర్ల వేంకటవధానిగారు
    • 2. ఎఱ్ఱాప్రగడ - డా. పి. యశోదారెడ్డిగారు
    • 3. అల్లసాని పెద్దన - డా. పల్లా దుర్గయ్యగారు

1965 - 66 సం. తెలుగుశాఖ సర్వసభ్య సమావేశంలో 'ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్ర సాహిత్య సదస్సు'ను ప్రారంభించి, అధ్యాపకులకు పరిశోధన వ్యాసాలను చదివి చర్చించే అవకాశం కలిగించాలని నిర్ణయం తీసుకోబడింది. దాని ననుసరించి 1966 సెప్టెంబరు 15వ తేదీన సదస్సు ప్రారంభోత్సవం జరిగింది. సదస్సు దాదాపు 16 సమావేశాలను జరిపింది. వాటలో దాదాపు 30 వ్యాసాలు చదవబడ్డాయి. డా.జి.వి.సుబ్రహ్మణ్యం, డా.యం.వీరభద్రశాస్త్రిగార్లు కార్యదర్శులుగా వ్యవహరించారు. ఆచార్య అవధానిగారు అధ్యక్షులు.

1973లో ఆచార్య బి.రామరాజుగారు తెలుగుశాఖ అధ్యక్షులయ్యారు. వరంగల్‌ పి.జి. సెంటర్‌ అధ్యక్ష్యాన్ని, తెలుగు శాఖ అధ్యక్షాన్ని సంయుక్తంగా నిర్వహించి 1974లో హైదరాబాదుకు వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలను నిర్వహించారు.

విశ్వవిద్యాలయంలో 1970 -71 సంవత్సరంలో ఎం.ఫిల్‌. డిగ్రీ ప్రణాళిక ప్రవేశపెట్టబడింది. ఆ నియమావళి కింద మొదట ప్రవేశాన్ని పొందటమే కాకుండా 1974లో మొట్టమొదట ఆ డిగ్రీని తెలుగు శాఖలో పొందినవారు వరంగల్‌లోని సి.కె.ఎం.ఆర్ట్స్‌ &సైన్స్‌ కళాశాలలో తెలుగుఉపన్యాసకులుగా పనిచేసిన జి.వెంకటరత్నంగారు. 'హంసవింశతి కావ్యంలో ప్రతిబింబించిన సమకాలీన సాంఘిక పరిస్థితులు' అన్నది వారి పరిశోధనాంశం. వారి సిద్ధాంత వ్యాసాన్ని పర్యవేక్షించినవారు ఆచార్య బి.రామరాజుగారు. రామరాజుగారు మొదటి పిహెచ్‌.డి.డిగ్రీని పొందినవారు కాగా వారి శిష్యుడు మొదటి ఎం.ఫిల్‌. గ్రహీత కావటం విశేషం.

1974లో ఎం.ఏ. తరగతుల్లో సెమిస్టర్‌ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆచార్య రామరాజుగారికి పరిశోధనంటే ప్రాణం. ఆధునిక విద్యారంగంలో పఠన పాఠనాలకెంత ప్రాధాన్యముందో పరిశోధనకంత ప్రాముఖ్యం ఏర్పడుతోంది. తెలుగుశాఖలో అధ్యాపకులకు తాము చేసే పరిశోధనాంశాలను వెలువరించుకొనే సాహిత్య సాధనం ఒకటి ఉంటే మరింత ఉత్సాహంతో రచనా వ్యాసంగాన్ని కొనసాగింపగలరని భావించి, తెలుగుశాఖలో పరిశోధన పత్రిక ఒకటి వెలువడాలని సంకల్పించారు. వారి సంకల్పానికి,1974లో జరిగిన సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా విశ్వవిద్యాలయం వారిని అర్థిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 'వివేచన' అన్న పేరుతో పత్రికను వెలువరించే ప్రయత్నం సాగింది.

పి.జి.సెంటర్‌లో ఆచార్య రామరాజుగారు ప్రారంభించిన మరొక ప్రధాన ప్రణాళిక పేర్కొనదగింది. అది 'విశ్వనాథ వాఙ్మయ జీవిత పరిశోధనా కార్యక్రమం'. విశ్వనాథ జీవిత వాఙ్మయ విశేషాలను దేశం నలుమూలల నుండీ సేకరించటం, వారి ముద్రితాముద్రిత గ్రంథాలను సంతరించటం జరిగింది. సేకరించిన అంశాలు 'విశ్వనాథ వాఙ్మయసూచి' అనే పేర 1974లో ఒక గ్రంథం ప్రచురితమయింది. దానికి సంపాదకులు డా.కేతవరపు రామకోటిశాస్త్రి, డా. కె.సుప్రసన్నాచార్యులు. ఆచార్య రామరాజుగారు ఆ కార్యక్రమానికిచ్చిన ప్రోత్సాహాన్ని సంపాదకులు ఆ గ్రంథంలో పేర్కొన్నారు.

ఆచార్య బి.రామరాజుగారు తెలుగుశాఖలో కొన్ని సత్సంప్రదాయాల్ని నెలకొల్పటానికి ప్రయత్నించారు. అందులో మొదటిది - తెలుగుశాఖాధ్యక్షులుగా ఉద్యోగ విరమణ చేసిన ఆచార్యులు షష్టిపూర్తి ఉత్సవాలు తెలుగుశాఖ పక్షాన నిర్వహించి, వారి కృషిని లోకానికి తెలియచెప్పటమే కాకుండా వారి తైలవర్ణ చిత్రాలను శాఖా కార్యాలయంలో అలంకరింపజేయటం. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అదృష్టం రాయప్రోలువారి నుండి అవధానిగారి వంటి ఆచార్య త్రయం నుండి నేటికి స్నేహాశీస్సులను పొందగలుగుతూ, ఆ సంప్రదాయం కొనసాగుతూ ఉంది.

1968లో జరిగిన విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ సందర్భంగా తెలుగుశాఖ ప్రథమాచార్యులైన రాయప్రోలు సుబ్బారావుగారికి గౌరవ బిరుదమైన డి.లిట్‌.ను ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవం తెలుగుశాఖకే కాదు తెలుగుజాతికే జరిగినట్టు.

తెలుగు శాఖలో మరొక ఆచార్య పదవి ఎన్నాళ్ళనుండో ఉంటూ వస్తుండేది. ఎవరినీ ఇందులో నియామకం చేయలేదు. రామరాజుగారు ఆ ఖాళీని పూర్తి చేయించటానికి ప్రయత్నించి సఫలులైనారు. ప్రసిద్ధ ఆధునికాంధ్ర కవులైన డా. సి.నారాయణరెడ్డిగారు ఆ పదవికి ఎన్నుకోబడటం విశ్వవిద్యాలయ ఔచిత్య దృష్టికి నికషోఫలం.

ఆ ఏడే వరంగల్‌ జిల్లా పి.జి.సెంటర్‌ కాకతీయ విశ్వవిద్యాలయంగా రూపొందింది. అందులో తెలుగుశాఖ ఈ మాతృకకు పుత్రిక.

తెలుగుశాఖ పరిశోధన రంగంలో తన ప్రత్యేకతను నిలబెట్టుకొంటూ వస్తోంది. తెలుగు శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న పత్రిక 'వివేచన' ప్రత్యేక ప్రచురణలో వెలువడుతూ వస్తోంది. ఆచార్య ననుమాస స్వామి మూడు మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మూడు మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు, ఆచార్య బాగయ్య, ఆచార్య నిత్యానందరావు, ఆచార్య గోనానాయక్‌, ఆచార్య సూర్య యు.జి.సి. మేజర్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టులు పొంది తెలుగుశాఖలో పరిశోధనలకు పదును పెడుతున్నారు. విద్యార్థుల విషయానికి వస్తే ఇంతకుముందు కంటే ఇప్పుడు అధికసంఖ్యలో జె.ఆర్‌.ఎఫ్‌. మరియు ఆర్‌.జి.ఎన్‌.ఎఫ్‌.లు సంపాదించుకొని ఇతర శాఖల్లో కంటే తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటున్నారు.

తెలుగుశాఖ పరిశోధన విషయానికి వస్తే ఈ శాఖలో ఎన్నో సిద్ధాంత వ్యాసాలు వెలువడ్డాయి. పిహెచ్‌.డి. పట్టాలను, ఎం.ఫిల్‌. పట్టాలను అందిస్తూ పరిశోధన మార్గంలో పయనిస్తూ తెలుగు సాహితీ ప్రపంచానికి యధోచితంగా కృషి చేస్తున్న ఈ శాఖ పాత్ర విశ్వవిద్యాలయ చరిత్రలో విస్మరింపరానిదనటంలో విప్రతిపత్తి లేదు.

ఒక వైపు నిరంతర ఉద్యమాల్లో నిమగ్నమైన క్రియాశీలంగా పాల్గొంటున్న ఉస్మానియా తెలుగుశాఖ విద్యార్థులు, మరోవైపు పరిశోధన విద్యార్థులు, లోతైన అధ్యయన, పరిశోధన కార్యక్రమాల్లోను అంతే క్రియాశీలంగా పాల్గొనడం ఒక విశేషం.

ఉస్మానియా తెలుగుశాఖ చరిత్రను, కృషిని గుర్తించిన 'ఇండస్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌'వారు 2012 సెప్టెంబర్‌ మాసంలో నిర్వహించిన అంతర్జాతీయ విద్యా సదస్సులో ఉస్మానియా తెలుగుశాఖకు ''అంతర్జాతీయ ఉత్తమ విద్యాపురస్కారాన్ని'' బహూకరించారు.

తెలుగుశాఖ అభివృద్ధీ వికాసాల చరిత్రను సమీక్షించటంలో శాఖాధ్యక్షులైన ఆచార్యులు పనిచేసిన కాలాలు అధ్యాయాలుగా పనికి వస్తాయి.

    • 1. రాయప్రోలు సుబ్బారావు (1919-1946)
    • 2. ఖండవల్లి లక్ష్మీరంజనం (1946-64)
    • 3. దివాకర్ల వేంకటావధాని (1964-73)
    • 4. బిరుదురాజు రామరాజు (1973-82)
    • 5. కోవూరు గోపాలకృష్ణారావు (1982-84)
    • 6. నాయని కృష్ణకుమారి (1984-86)
    • 7. మడుపు కులశేఖరరావు (1986-88)
    • 8. అమరేశం రాజేశ్వరశర్మ (1988-89)
    • 9. వేటూరి ఆనందమూర్తి (1989-90)
    • 10. ఎస్వీ రామారావు (1990-92)
    • 11. వి. సీతాకల్యాణి (1992-94)
    • 12. ఎన్‌.గోపి (1994-96)
    • 13. ఎల్లూరి శివారెడ్డి (1996-98)
    • 14. ఎల్దండ రఘుమన్న (1998-2000)
    • 15. ఎల్లూరి శివారెడ్డి (2000-2002)
    • 16. కసిరెడ్డి వెంకటరెడ్డి (2002-2005)
    • 17. పి.సుమతీ నరేంద్ర (2005-2007)
    • 18. కె.కుసుమారెడ్డి (2007-2008)
    • 19. టి.కిషన్‌రావు (2008-2010)
    • 20. ననుమాసస్వామి (2010-2011)
    • 21. ఎస్వీ సత్యనారాయణ (2011-2013)
    • 22. మసన చెన్నప్ప (2013-2015)
    • 23. వెలుదండ నిత్యానందరావు (2015-2017)
    • 24. గోనా నాయక్‌ (2017-2017)
    • 25. డి. సూర్య ధనుంజయ్‌ ( 2017 నుండి )